షెడ్యూల్ ప్రకారం పరీక్షలు సముచితం కాదు : సోము వీర్రాజు
ఏపీలో కోవిడ్ కారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. కరోనా పెరుగుతున్న కారణంగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడం ఏమాత్రం సముచితం కాదన్నారు. విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి, రవాణా ద్వారానే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటారని, దీని ద్వారా కరోనా సోకే ప్రమాదముందని లేఖలో హెచ్చరించారు. దీంతో కరోనా కేసులు రాష్ట్రంలో మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే పరీక్షలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రులపై ఓ నిఘా వేసి ఉంచాలని, కరోనా చికిత్స కోసం అత్యధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటితో పాటు ఆక్సిజన్ సరఫరాపై కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని సోము వీర్రాజు సూచించారు.













