విపక్షాలే టార్గెట్టా?
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామంటూనే పవన్ పై సెటైర్లు వేసేశారు. ఇక ప్రతిఒక్కరూ ప్రాణహాని ఉందని సెక్యూరిటీ కల్పించాలని కోరితే కేంద్రం అందరికీ కల్పించలేదని పవన్ని ఉద్దేశించి సోము వీర్రాజు పరోక్షంగా కామెంట్ చేశారు. పొత్తులు అంశం కేంద్రం చూసుకుంటుందని అన్నారు. పవన్ ప్రాణహాని కామెంట్లపై వైసీపీ నేతలు విరుచుకుపడుతుంటే.. ఈవ్యవహారంపై సోము ఎంటరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈదఫా ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దానికి తగ్గట్లుగానే ఇరుపార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. పవన్ పలుమార్లు కేంద్ర హోంమంత్రిఅమిత్ షా, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలను కలిసి.. రాష్ట్రంలో పరిస్థితి వివరించడం జరుగుతూ వస్తోంది. ఇంత సాన్నిహిత్యం ఉండి కూడా.. తన ప్రాణాలకు హాని ఉందని పవన్ ప్రకటిస్తే.. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అండగా నిలవడం మాని.. తిరిగి సెటైర్లు వేయడం జనసైనికులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
దీనికి తోడు చంద్రబాబును సోము వీర్రాజు కార్నర్ చేశారు.మొన్నటికి మొన్న జగన్ కు కేంద్రం అండగా ఉంటుంది..వివేకా కేసులో చర్యలు లేవు.. జగన్ పై ఎందుకు చర్యలు ఉండడం లేదని కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రకటనలు కాదు.. చర్యలు కావాలన్నారు. దీనికి సోమువీర్రాజు కౌంటరిచ్చారు.తాను సీఎంగా ఉండబట్టే జగన్ గతంలో పాదయాత్ర చేయగలిగాడుఅని చెప్పిన చంద్రబాబు.. ఆరోజు ఒక్కచర్య తీసుకోకుండా, ఈరోజు ఆయనపై కేంద్రమే చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యలు చేయడం వెనక ఎవరిని టార్గెట్ చేయాలని అనుకుంటున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబుచేస్తే తన నుండి కూడా చాలా అంశాలు బయటికొస్తాయన్నారు.. అంతే కాదు.. టీడీపీ హయాంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ పై రాళ్లు వేయిస్తే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.మీరు మాత్రం ఏపీలో అధికారంలోకి రావాలి, బీజేపీ మాత్రం అన్నింటికి సమాదానం చెప్పాలనడం మంచి పద్దతికాదని, బాబు పద్ధతి మార్చుకోవాలని అన్నారు.
అయితే టీడీపీ శ్రేణులు మాత్రం.. సోమువీర్రాజు కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోము వీర్రాజు.. అధికారంలో ఉన్న జగన్ ను ఏమీ అనరని.. జగనంటే భయమో, భక్తో అర్థం కాదంటున్నాయి.. అదే సమయంలో మిత్రపక్షమైన పవన్ పైనా కౌంటర్లకు ముందుంటారని సెటైర్లు వేస్తున్నాయి. మరోవైపు.. కేంద్రం పవన్ కు ఇంపార్టెన్స్ ఇస్తుండగా.. రాష్ట్రంలో సోమువీర్రాజు మాటలు దానికి భిన్నంగా ఉంటున్నాయని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.













