Somu Veerraju: సోము వీర్రాజును వరించిన అదృష్టం..! ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన..!!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు (AP MLC Elections) ఇవాళ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరి రోజు. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో ఉన్న బలం దృష్ట్యా అన్ని స్థానాలూ కూటమి పార్టీలకే దక్కుతాయి. దీంతో వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. టీడీపీ 3, జనసేన 1, బీజేపీ 1 స్థానంలో పోటీ చేయనుంది. చివరి నిమిషంలో బీజేపీ తమకూ ఓ సీటు ఇవ్వాలని కోరడంతో టీడీపీ (TDP) అంగీకరించక తప్పలేదు. ఆ స్థానాన్ని సీనియర్ నేత సోము వీర్రాజుకు (Somu Veerraju) ఇస్తూ బీజేపీ (BJP) ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయన రెండోసారి ఎమ్మెల్సీ కాబోతున్నారు.
సోము వీర్రాజు బీజేపీ సీనియర్ నేత. దాదాపు 4 దశాబ్దాలుగా ఆ పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది. ఆరెస్సెస్ నుంచి వచ్చిన ఆయన 1980లో బీజేవైఎమ్ జిల్ల జనరల్ సెక్రటరీగా పని చేశారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఇప్పుడాయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 2015 నుంచి 2021 వరకూ ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. ఇప్పుడాయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సోము వీర్రాజు కరుడుగట్టిన బీజేపీ నాయకుడిగా చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిన నేత. అందుకే ఆయనపై జాతీయ నాయకత్వం విశ్వాసం ప్రదర్శించింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ పదవి నుంచి తప్పించి కన్నా లక్ష్మినారాయణకు అప్పగించారు. ఆ సమయంలో తగిన సమయంలో తగిన పదవి ఇస్తామని బీజేపీ నాయకత్వం హామీ ఇచ్చింది. దాని మేరకు ఇప్పుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. ఇందుకు టీడీపీ, జనసేన కూడా అంగీకరించడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది.
ఇప్పటికే ఓసారి సోము వీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేసి ఉండడంతో ఉత్తరాంధ్ర నేత మాధవ్ కు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే చివరి నిమిషంలో ఆ అదృష్టం సోము వీర్రాజునే వరించింది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, ఆ సామాజిక వర్గం ప్రభావం ఏపీలో బలంగా ఉండడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ కట్టబెట్టినట్టు తెలుస్తోంది.













