ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
ఆంధప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కన్నా లక్ష్మీనారాయణను అనూహ్యంగా పక్కకు తప్పించారు. కన్నాను మరో విడత పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారని, లేదా ఎమ్మెల్సీ పీవీ మాధవ్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తారని తొలుత బలంగా ప్రచారం జరిగింది. కానీ, వీర్రాజుకే బీజేపీ అధిష్ఠానం పట్టం కట్టింది. తూర్పు గోదావరి జిల్లా కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజు ఎమ్మెల్సీ కాలపరిమితి ఇంకో ఏడాదితో ముగియనుంది. 2018లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కన్నాతో వీర్రాజు పోటీ పడ్డారు. చివరి నిమిషంలో అధిష్ఠానం వీర్రాజుకు ఎన్నికల కమిటీ బాధ్యతలు అప్పగించింది, రాష్ట్ర అధ్యక్ష పదవిలో కన్నాను నియమించింది. ఇప్పుడు కన్నాను తప్పించి, అదే సామాజిక వర్గానికి చెందిన వీర్రాజును నియమించారు.













