ఆరోగ్య మంత్రి నేతృత్వంలో ఓ కమిటీని పంపండి : సోమిరెడ్డి
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోందని, అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనే ఎక్కువ కల్లోలం ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి నేతృత్వంలోని ఓ కమిటీని వెంటనే నెల్లూరు పంపాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో పరిస్థితి చేయిదాటక మునుపే పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు. నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్న అన్ని బెడ్లపై వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న వెంటిలేటర్లను తాత్కాలికంగా ప్రైవేట్ ఆస్పత్రులను పంపి, ఉచితంగా వైద్య సేవలు అందించాలని సీఎంకు సూచించారు. కోవిడ్ మొదటి దశలో జరిగిన పొరపాట్లు ఈ రెండో వేవ్‌లో పునరావృత్తం కాకుండా చూసుకుంటూ, వెంటనే వైద్య సిబ్బందిని నియమించాలని సోమిరెడ్డి ఆ లేఖలో కోరారు. నెల్లూరులో ఉంటున్న కరోనా రోగులు లక్షలు పెట్టి చెన్నైకి వెళ్తున్నారని, అలా జరగకుండా నెల్లూరులోనే వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి సీఎం జగన్‌కు కోరారు.













