ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిని మారుస్తారా?
రైతుల ఒప్పందంతో పెట్టిన రాజధాని అమరావతి అని, చట్టబద్దంగా భూములు ఇచ్చిన రైతులతో ఒప్పందం అయ్యిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అమరావతి రాజధాని గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మారదని అన్నారు. అడ్డగోలుగా తీసుకెళ్లినా మళ్లీ వెనక్కి వస్తుందన్నారు. బీజేపీ నేతలు జీవీఎల్, సోమువీర్రాజు, సునీల్ డియోధర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జీవియల్కు దమ్ముంటే ఉత్తర్ ప్రదేశ్ రాజధాని మార్చాలని సవాల్ చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని మారుస్తారా? అని మండిపడ్డారు. 71 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తుంటే మంత్రులకు కనిపించ లేదా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన మంత్రులను పంపించి ఎందుకు చర్చించ లేదని నిలదీశారు. ప్రజల మధ్య గొడవలు పెట్టేందుకు రాజధానిలో 1250 ఎకరాలు పంపిణీకి ప్రభుత్వం కేటాయించిందని, ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడకు వచ్చి ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు.













