ఐటీకి చిరునామా సీఎం చంద్రబాబే : సోమిరెడ్డి
హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించి ప్రపంచానికే ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వరల్డ్ ఆగ్రికల్చర్ ఫోరం ఆహ్వానం మేరకు ఆయన సింగపూర్ వెళ్లారు. అక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటికి చిరునామా సిఎం చంద్రబాబేనని పేర్కొన్నారు. ప్రపంంచంలోని పేరొందిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆ ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. పర్యాటకరంగానికి పట్టుకొమ్మలాంటి విశాఖపట్నం ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. విశాఖతోపాటు విజయవాడ, కాకినాడ, తిరుపతి, అనంతపురంలో ఐటీ పార్కుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖపట్నంలో 50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటిటౌన్షిప్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మెగా ఐటిహబ్కు ల్యాండ్ మార్కుగా రుషికొండలో 10 లక్షల చ.అ విస్తీర్ణంలో సిగ్నేచర్ టవర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సింగపూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నంబూరి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ చెన్నుపాటి భానుచంద్, సెక్రటరీ పారేపల్లి సతీష్‌కుమార్, సభ్యులు వినయ్‌కుమార్, శ్రీనివాస్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.













