ఇదేనా వైసీపీ చేసిన అభివృద్ధి ? : సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో అద్బుతాలు జరిగాయని రాష్ట్ర మంత్రులు జోకులేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మూడేళ్లలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో, ఏం సాధించారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఇరిగేషన్ మూలనపడింది. రోడ్లపై గుంతులు పూడ్చే దిక్కు లేదు. ఇదేనా వైసీపీ చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు.
ఎస్ఆర్ఈజీఎస్ నిధులతో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలతో ఎలాంటి ఉపయోగం లేదని, అవి రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు. 2020-21 బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ.20 వేల కోట్లు కేటాయించారని, ఖర్చు పెట్టింది కేవలం రూ.7వేల కోట్లే అన్నారు. అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కే విలువ ఇవ్వని వైసీపీ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.













