అమరావతికి అనుకూలంగా నిర్ణయం.. లేదంటే ప్రజలు : సోమిరెడ్డి
తిరుపతిలో నిర్వహించిన అమరావతి సభ చరిత్ర సృష్టించిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో విజయవంతమైన సభ ఇదని పేర్కొన్నారు. దీక్షతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభం నుంచి సభ ముగిసేవరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా అండగా నిలవడం విశేషమని కొనియాడారు. అధికార వైసీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా కేసులు పెట్టి ఆటంకాలు సృష్టించినప్పటికీ రాష్ట్ర ప్రజలందరూ అమరావతి వైపే నిలిచారని పేర్కొన్నారు. కేంద్రంలో అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే రైతుల పోరాటానికి తలొగ్గి మూడు కీలక బిల్లులను వెనక్కి తీసుకుందన్నారు.
రాష్ట్రంలో వైకాపా మినహా అన్ని పార్టీలు, యువజన, కార్మిక, రైతు ప్రజా సంఘాలన్నీ రాజధాని రైతులకు జై కొట్టాయన్నారు. రైతులు నెలల తరబడి దీక్షలు చేసినా, వందల కిలోమీటర్లు నడిచినా సీఎం జగన్ మనసు కరగకపోవడం దురదృష్టకరమని వెల్లడిరచారు. ఇప్పటికైనా సీఎం జగన్ కళ్లు తెరిచి అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే ప్రజలు క్షమించరని సోమిరెడ్డి పేర్కొన్నారు.













