ఎవరైనా అడ్డుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తాం : సోమిరెడ్డి
విధాన పరమైన నిర్ణయాలు మినహా ప్రభుత్వం మామూలుగానే విధులు నిర్వహించవచ్చని ఎన్నికల సంఘం చెబుతున్నా, ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్షలను వైకాపా నేతలు తప్పుపట్టడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ తన శాఖకు సంబంధించి వ్యవసాయం, రైతులకు సంబంధించి సమీక్షలు నిర్వహించి తీరుతానని సృష్టం చేశారు. ఎవరైనా అడ్డుకుంటే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రిగా తాను చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి ఎవరి వద్దకు పోవాలని ప్రశ్నించారు.
పరిపాలనను స్తంభింప చేసే అధికారం ఎన్నికల కమిషన్కు, అధికారులను అడ్డుకునే అధికారం ప్రధాన కార్యదర్శికి లేదన్నారు. సమీక్షలు నిర్వహించి అధికారం తనకు ఉందని సృష్టం చేశారు. తమది అపద్ధర్మ ప్రభుత్వం కాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది పరిపాలించాలని వైకాపా నేతలు కోరుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తేనో, బలపరీక్షలో ఓడిపోతేనో, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందన్నారు.













