పోయేకాలం దగ్గరపడే ఇలాంటి ఆరాచకాలు : సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట, పెద్దాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేకనే అనపర్తిలో అడ్డంకులు సృష్టించారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో నియంతృత్వ, నిరంకుశ, దుర్మార్గపు పాలన కొనసాగుతోంది. సీఎం జగన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ పాదయాత్రలు చేసినా, కార్యక్రమాలు నిర్వహించుకున్నా ఏనాడు అడ్డంకులు సృష్టించలేదు. రోడ్లపై అడ్డంగా నిలబడి పీకే రాసిసిన పచ్చి అబద్దాలు చెబుతున్నా టీడీపీ హయాంలో పోలీసులు వారిని అడ్డుకున్నారా? నియంతపాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడింది. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడితే ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యం కోసం మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది చాలా బాధకరం అని అన్నారు.













