ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన సోమేశ్ కుమార్,.. సీఎం జగన్ తో భేటీ
తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి జాయినింగ్‌కు సంబంధించిన ప్రక్రియను ఆయన పూర్తి చేశారు. అనంతరం సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును ఇటీవల హైకోర్టు కొట్టేసింది. విభజన సమయంలో ఆయన్ను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించగా, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) తెలంగాణకు మార్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను కొట్టేసి సోమేశ్ కుమార్ ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు ఇచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. తనకు అప్పగించే బాధ్యతల్లో కొనసాగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఆయనకు ఏ పోస్టింగ్ ఇస్తారనే దానిపై సర్వ్రతా ఉత్కంఠ నెలకొంది.













