జగనన్నా.. బ్రాండ్స్ కావాలన్నా..! ప్లీజ్..!!
ఎన్నికల సమయంలో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ విజ్ఞప్తి చేయడం మనం చూస్తూనే ఉంటాం. EVMలు వచ్చిన తర్వాత ఇలా డిమాండ్స్ చేయడం కుదరట్లేదు. కానీ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరిగినప్పుడు మాత్రం బ్యాలెట్ పేపర్లతో పాటు తమ విజ్ఞప్తులను బాక్సుల్లో వేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇలాంటి విజ్ఞప్తులు పలు చోట్ల నుంచి వచ్చాయి. అయితే కర్నూలు జిల్లా నంద్యాలలో మాత్రం ఓటర్లు ఓ విచిత్రమైన కోరిక కోరారు.
మున్సిపల్ ఎన్నికల్లో మూడు చోట్ల నుంచి ఓటర్లు తమ డిమాండ్లను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో కొంతమంత్రి ఓటర్లు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దనే డిమాండ్లతో కూడిన స్లిప్పులను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. ప్రైవేటీకరణకు మద్దతు పలకాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఇలాంటి వినతులు వస్తాయని ముందే ఊహించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఓటర్లు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని భావించాం.
అలాగే అమరావతిని రాజధానిగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత ఓటర్లు కూడా కొన్నిచోట్ల స్లిప్పులను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. ఇది కూడా కొత్త విషయమేం కాదు. ఏడాదికి పైగా అమరావతి ప్రాంత రైతులు రాజధాని పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వం రాజధానిని ఇక్కడే ఉంచాలనే డిమాండ్ తో ఈ ఉద్యమం సాగుతోంది. దీంతో ఇక్కడి నుంచి కూడా ఓటర్లు ఇలాంటి స్లిప్పులు వేయొచ్చని అంచనా వేశారు.
అయితే అస్సలు ఊహించని విజ్ఞప్తి కర్నూలు జిల్లా నంద్యాల ఓటర్ల నుంచి వచ్చింది. ఇది చూసి కౌంటింగ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. నంద్యాల 29వ వార్డులో కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసినప్పుడు బ్యాలెట్ పేపర్లతో పాటు ఓ తెల్లకాగితం కనిపించింది. అది ఓపెన్ చేసి చూడగానే ఆశ్చర్యపోవడం వారి వంతయింది. నంద్యాల తాగుబోతుల సంఘం ఆ పేపర్ ను బ్యాలెట్ బాక్సులో వేశారు. ఇంతకూ అందులో ఏముందంటే… బ్రాండెడ్ మద్యం ఇవ్వాలంటూ ఏకంగా సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. సుప్రీం, దారు, హైదరాబాద్, జంబో వంటి బ్రాండ్లు కాకుండా రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ లాంటి బ్రాండ్లను అమ్మాలని కోరారు. అంతేకాదు.. పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు.. అని కూడా హెచ్చరించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం ధరలను భారీగా పెంచింది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. మద్యాన్ని అధిక ధరలకు అమ్మడం ద్వారా కొనుగోళ్ళు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అంతేకాదు.. బ్రాండెండ్ మద్యాన్ని తగ్గించేసి లోకల్ మేడ్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. బహుశా.. ఇలా బ్యాలెట్ బాక్సులో వేస్తే అయినా పాలకులు కనికరిస్తారేమోనని తాగుబోతుల సంఘం భావించి ఉండొచ్చు. మరి సీఎం గారు వారి వినతిని మన్నిస్తారో.. లేదో.. చూద్దాం..













