Chandra Babu: కూటమి ప్రభుత్వంతో సామాజిక న్యాయం: రెండు లక్షల కొత్త పెన్షన్లకు మంజూరు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే రెండు కీలక అంశాలపై సమతుల్యంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సామాజిక భద్రతను బలంగా నిలబెట్టేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మద్దతు సంపాదిస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం, అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని ఒక్కసారిగా ₹1000 పెంచడం ద్వారా పెద్దలందరికీ ఊరట కలిగించింది. అంతేకాక, పెరిగిన మొత్తాన్ని ఏప్రిల్ (April) నెల నుంచే చెల్లిస్తూ, అప్పటి నుంచి ఉన్న బకాయిలను కూడా క్లియర్ చేయడంతో లబ్దిదారుల హర్షం వ్యక్తమవుతోంది.
ఇప్పుడు తాజాగా ఆగస్టు (August) నెల నుంచి కొత్తగా మరో రెండు లక్షల మంది అర్హులుగా గుర్తింపు పొందిన వారికి కూడా పెన్షన్లు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో చాలామంది గత ప్రభుత్వ హయాంలో అర్హులైనా కూడా కొన్ని కారణాల వల్ల పెన్షన్ పొందలేకపోయారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారిని సమీక్షించి, అర్హులుగా తేల్చిన వారికి ఆగస్టు నుంచే పింఛన్ అందించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. అంతేకాకుండా, భర్త మరణించిన వితంతువులకు కూడా తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రతి నెలా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మరుసటి నెల నుంచే పింఛన్ అందేలా చర్యలు తీసుకోవడం ద్వారా, అవసరమున్న ప్రతి కుటుంబానికి ఆర్థిక మద్దతు అందించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విధంగా సామాజిక పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తోంది.
గత ప్రభుత్వంలో అనర్హులకు కూడా పింఛన్లు అందినట్లు తాజా సర్వేల్లో తేలింది. ముఖ్యంగా వికలాంగుల విభాగంలో అనేక జాబితాల్లో తప్పులు ఉన్నట్టు గుర్తించారు. అలాగే మరణించిన వారిపేరు మీద ఇంకా పింఛన్లు వస్తున్న ఉదాహరణలు బయటపడ్డాయి. కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినా అక్కడి నుంచే పింఛన్ పొందుతున్నారు అని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సర్వేలు చేపట్టి అర్హులైనవారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేసేలా వ్యవస్థను సరిచేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 62,81,768 మందికి పెన్షన్లు అందుతున్నాయి. ఇందులో అనేక జాబితాల్లో మార్పులు, సవరింపులు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే శ్రావణ మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరవడం, ప్రభుత్వం వైపు నుంచి సామాజిక భద్రతపై తీసుకుంటున్న సానుకూల దృష్టిని స్పష్టంగా చూపిస్తోంది. ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.