Smart AP Foundation signs MoU with IDFOI
ఇతర దేశాల్లో నివసించే భారతీయులు…ముఖ్యంగా ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు దాతలుగా ముందుకు వస్తే పాలనాపరంగా ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా మార్గం సుగమం అయింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ-స్మార్ట్ ఆంధ్ర ప్రదేశ్ ఫౌండేషన్ సంస్థ మధ్య ఈ రోజు ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. విదేశీ వ్యవహారాల శాఖకు అనుబంధంగా ఉన్న ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్ అఫ్ ఓవర్సీస్ ఇండియన్స్ (ఐ.డి.ఎఫ్.ఓ.ఐ) తరఫున ఆ శాఖ సంయుక్త కార్యదర్శి వాణి రావు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ తరఫున బి.గంగయ్య ఈ ఒప్పందంపై ఈ రోజు సంతకాలు చేసారు.
ఈ అవగాహన ఒప్పందం వల్ల ప్రవాస భారతీయులు ఎఫ్.సి.ఆర్.ఏ అనుమతులతో సంబంధం లేకుండా ఐ.డి.ఎఫ్.ఓ.ఐ వెబ్ సైట్ ద్వారా తమ విరాళాలు నేరుగా అందించవచ్చు. విద్య, వైద్యము, పారిశుధ్యం, మహిళా సాధికారత, సుస్థిర గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో కార్యక్రమాలకు నిధులను విరాళాలుగా ఇవ్వడానికి ఇక స్వేచ్ఛగా ముందుకు రావచ్చు. పాలనాపరమైన రుసుము కానీ, అదనపు చెల్లింపులు కానీ ఎటువంటి పన్నులు కానీ లేకుండానే దాతలు నిధులు సమకూర్చవచ్చన్నది ఈ ఒప్పందం లో ముఖ్య అంశం. దాతలు తాము ఇచ్చే నిధులు సూచించే ప్రొజెక్టలకే వినియోగిస్తారు, లేని పక్షం లో ఒప్పందం కుదుర్చుకున్న రెండు సంస్థలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తో సంయుక్తంగా చర్చించి ఆ నిధులను వినియోగించే ప్రణాళికలను రూపొందిస్తారు. విదేశాల్లో ఇటువంటి నిధుల సమీకరణ కు నిర్వహించే సదస్సుల్లో ఐ.డి.ఎఫ్.ఓ.ఐ, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సంస్థలు కూడా పాలుపంచుకుంటాయి.













