ఘనంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణోత్సవం
కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుండి భక్తులు విచ్చేశారు. ఆకాశమంత పందెళ్లువేసి పూలు మరిమలాలు, విద్యుత్ కాంతులు, భక్తుల కోలాటాలు, దీపాలతో కూడిన కల్యాణ వేదిక వైకుంఠాన్ని తలపించింది. జగదభిరాముని కల్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు, గరవ్నర్ నరసింహన్ దంపతులు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ కార్యక్రమాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ సీతారాముల విగ్రహాల శిరస్సులపై జీలకర్ర, బెల్లం పెట్టారు. ఈ సన్నివేశాన్ని వేద పండితులు ప్రజానీకానికి చూపించి సీతమ్మ వారి మెడలో మగళసూత్రాన్ని ధరింపచేశారు. కల్యాణ వేదిక రామనామ స్మరణతో మార్మోగింది. కల్యాణ వేదిక వద్ద భక్తులను ఆకట్టుకునేలా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.













