AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో భారీ మలుపు..12 పెట్టెల్లో దాచిన రూ.11 కోట్ల సీజ్..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో అమలైన మద్యం విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగా మద్యం పాలసీలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తులో స్పష్టమవుతోంది. ఇప్పటికే తొమ్మిది నెలలకుపైగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. విచారణ సాగుతున్నప్పటికీ రోజుకో కొత్త మలుపు, మళ్లీ కొత్త అక్రమాల వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే వైసీపీ నేతలు పలువురు లిక్కర్ స్కామ్ ( liquor scam) లో అరెస్టయినప్పటికీ, తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తం 12 అట్టపెట్టెలో దాచిన రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసులో ఏ-40 నిందితుడిగా ఉన్న వరుణ్ (Varun) అనే వ్యక్తిని విచారిస్తున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ డబ్బును సోదాలు చేసి స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, ఈ మొత్తం నగదును కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి (Kasireddy Rajasekhar Reddy @ Raj Kasireddy) ఆదేశాల మేరకే దాచినట్లు వరుణ్ విచారణలో అంగీకరించినట్టు సమాచారం. అదే విషయాన్ని మరో నిందితుడు అయిన బూనేటి చాణక్య (Booneti Chanakya) కూడా ధృవీకరించాడు.
2024 ఎన్నికల సమయంలో ఈ సొమ్మును తరలించే ప్రయత్నం చేశారని, కానీ అప్పట్లో నిఘా బలగాల శక్తివంతమైన జోక్యంతో సొమ్మును తరలించలేకపోయారని వారు చెప్పారు. దీంతో అది హైదరాబాద్‌లోని శంషాబాద్ (Shamshabad) మండల పరిధిలో ఉన్న కాచారం ఫామ్‌హౌస్ (Kacharam Farmhouse) లో దాచినట్టు విచారణలో వెల్లడి అయ్యింది. ఈ ఆధారాలన్నింటిపై స్పందించిన సిట్ అధికారులు తక్షణమే స్పందించి ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించి, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి మలుపులతో కేసు మరింతగా దుమారం రేపుతోంది. రోజుకో కొత్త వ్యక్తి పేరుతో పాటు అక్రమాలకు సంబంధించి వివరాలు వెలుగులోకి వస్తుండటంతో ఇది కేవలం సాధారణ మద్యం పాలసీ తప్పులు కాదు, గొప్ప వ్యూహబద్ధతతో జరిపిన ఆర్థిక కుంభకోణంగా చూస్తున్నారు. కేసు ఎటు తిరుగుతుందో అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు కానీ, విచారణ మాత్రం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో లిక్కర్స్ కాంకేస్ విషయంలో ఇంకా ఎవరి పేర్లు బయటికి వస్తాయో చూడాలి..