Raj Kasireddy: మద్యం కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు రాజ్ కసిరెడ్డి ఆపసోపాలు..!!
ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) నేతృత్వంలో వైసీపీ (YCP) అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడు ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajasekhar Reddy) ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ఐటీ సలహాదారుగా (IT Advisor) ఉన్న తనకు ఈ కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరు కాకుండా ఈ మేరకు ఆయన అధికారులకు ఈమెయిల్ పంపినట్లు సమాచారం. అయితే జగన్ హయాంలో సలహాదారులు అధికార దుర్వినియోగం చేసి, సొంత లాభం కోసం పనిచేశారనే ఆరోపణలు కోకొల్లలు. వాళ్లకు నిర్దేశించిన పనితో సంబంధం లేకుండా అన్నింటిలో వేలు పెట్టారనే విమర్శలున్నాయి.
వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విధానంలో (Liquor policy) పెను మార్పులు చేసింది. ఈ విధానం ప్రకారం మద్యం దుకాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని నిర్వహించే బాధ్యతను రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు అప్పగించింది. అయితే ఈ విధానం అమలు సమయంలో అనేక అవకతవకలు జరిగాయని దీని వల్ల రాష్ట్ర ఖజానాకు 18,860 కోట్ల నష్టం వాటిల్లిందని ఇటీవల కూటమి ప్రభుత్వం ఆరోపించింది. ఈ కుంభకోణంపై సీఐడీ (CID Enquiry) విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). ప్రస్తుతం దీన్ని సీఐడీ విచారిస్తోంది. మద్యం సరఫరా గొలుసులో అవినీతి, ఉత్పత్తి స్థాయిలో అక్రమాలు, పాత సంస్థలను బెదిరించడం, బహుళజాతి కంపెనీలకు చెల్లింపులు ఆలస్యం చేయడం వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర ఉందని సాక్షాత్తూ ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన ఐటీ రంగంలో నిపుణుడిగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ కుంభకోణంలో ఆయన పేరు బయటకు రావడం ఆశ్చర్యం కలిగించింది. రాజ్ కసిరెడ్డిపై గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మూడు FIRలు నమోదు చేశారు. జనవరి నుంచి ఆయన ఆచూకీ లేకుండా పోయింది. ఆయన చివరి కాల్ హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో నమోదైంది. ఆయన్ను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరు కావట్లేదు.
రాజ్ కసిరెడ్డి తనపై ఉన్న ఆరోపణలను ఖండిస్తున్నారు. తాను ఐటీ సలహాదారుగా మాత్రమే పనిచేశానని, మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణ అధికారులకు ఈమెయిల్ ద్వారా తెలిపారు. ఐటీ సలహాదారుగా ఉన్న తనకు మద్యం వ్యాపారంతో సంబంధం ఏంటో చెప్పాలని ఆయన ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. పైగా విచారణకు హాజరు కాకుండా ఈమెయిల్ ద్వారా రిప్లై ఇవ్వడంతో ఆయన ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 4న సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ రాజ్ కసిరెడ్డి హైకోర్టు ఆశ్రయించారు. అయితే కోర్టు ఆయన పిటిషన్ను కొట్టివేసింది.
వాస్తవానికి జగన్ ప్రభుత్వంలో సలహాదారులు అనేక విభాగాల్లో అధికార దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala Ramakrishna reddy) ఎలాంటి పాత్ర పోషించారో అందరికీ తెలుసు. ఆయన్ను సకలశాఖ మంత్రిగా పిలుచుకునేవారు. ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణంలో పాత్ర లేదనడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ ఆర్థిక లావాదేవీలన్నింటినీ రాజ్ కసిరెడ్డే చూసుకుంటూ ఉంటారని, ఆలంటి వ్యక్తికి ఇందులో సంబంధం లేదంటే నమ్మాలా అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా తన ప్రమేయం లేకపోతే విచారణకు హాజరు కాకుండా ఎందుకు తప్పించుకుంటున్నారని అడుగుతున్నారు. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడినట్లయింది.
మరోవైపు ఈ కేసును ఈడీకి (ED) రిఫర్ చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ కుంభకోణం సొమ్ములో కొంత భాగం విదేశాలకు తరలిపోయిందని లోక్ సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (TDP MP Lavu Srikrishna devarayalu) వెల్లడించారు. దీంతో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై ఈడీ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ కేసు మరింత జటిలం కానుంది. రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉండడం, ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చాయి.













