AP Liquor Scam: ఏపీలో లిక్కర్ కుంభకోణం కేసులో కొత్త మలుపు.. కసిరెడ్డి ఇంటిపై సోదాలు..
ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లిక్కర్ కుంభకోణంపై (AP Liquor Scam) ఇప్పుడు కొత్తగా ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవహారంలో దాదాపు రూ.2000 కోట్ల ప్రజాధనాన్ని కుంభకోణంగా మింగేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. దీనికోసం విజయవాడ (Vijayawada) పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు (Rajasekhar Babu) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ దర్యాప్తులో పలువురు కీలక నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ (Kasireddy Rajasekhar Reddy ) పేరు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఒక దశలో ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) పేరు కూడా వెలుగులోకి వచ్చింది. దీనితో ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ కూడా పొందారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో మరో మలుపు తిరిగింది. ఇప్పటికే మూడు సార్లు కసిరెడ్డిని విచారణకు పోలీసులు పిలిచారు. కానీ ప్రతి సారి ఏదో ఒక కారణంతో తప్పించుకుంటూ వచ్చారు. ఒకసారి తాను బిజీగా ఉన్నానన్నారు, మరోసారి ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు. తాను పనిచేసిన శాఖ వేరని చెప్పారు. అంతేకాకుండా ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించారు. ఇంకా ఈ వ్యవహారం పూర్తిగా తేలకపోవడంతో పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.
ఇటీవలే ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాదులో సోదాలు చేపట్టింది. బంజారాహిల్స్ (Banjara Hills) లో ఉన్న కసిరెడ్డి నివాసం, కార్యాలయంపై దాడులు చేశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ ఇంటిని పూర్తిగా జల్లెడ పట్టారు. పలు విలువైన పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల సమయంలో ఇంట్లో ఉన్నవారిని బయటకు వెళ్లకుండా నియంత్రించారు. స్థానికంగా ఉన్న పోలీసుల సహాయంతో భద్రతను కట్టుదిట్టంగా అమలు చేశారు. కసిరెడ్డి ఇంట్లో దాడులు జరుగుతున్న సమయంలో ఆయన అక్కడ లేరని సమాచారం. అయితే ఈ దాడుల గురించి అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఈ కేసు లో ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయో చూడాలి.













