Mithun Reddy: లిక్కర్ స్కాంలో స్పీడ్ పెంచిన సిట్.. మిథున్ రెడ్డికి నోటీసులు..!
ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రూ.3వేల కోట్ల లిక్కర్ స్కాం (Liquor Scam) జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (Peddireddy Mithun Reddy) కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కేంద్రంగా జరిగిన ఈ అవినీతిలో పలువురు ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం (TDP Govt) గతేడాది నవంబర్లో విచారణకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో భాగంగా మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy), కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajasekhar Reddy) వంటి పలువురికి నోటీసులు జారీ చేసింది.
లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్రపై అధికార పక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishnadavarayalu) లోక్సభలో ఈ స్కాం గురించి ప్రస్తావించారు. వైసీపీ పాలనలో మద్యం ఉత్పత్తి, విక్రయాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించి, నగదు చెల్లింపుల ద్వారా అక్రమ లాభాలు ఆర్జించారని ఆరోపించారు. మిథున్ రెడ్డి ఈ స్కాంలో లావాదేవీలను దగ్గరుండి చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసులు జారీ చేసింది.
లిక్కర్ స్కాంలో తన పేరు బయటకు రాగానే మిథున్ రెడ్డి వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును (AP High Court) ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 3, 2025న హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో ఆయన ఏప్రిల్ 7, 2025న సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. FIRలో పేరు నమోదు కాకుండానే మిథున్ రెడ్డికి బెయిల్ రావడంపై చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి ఆదేశించింది. దీంతో ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచింది సిట్. అయితే దీనిపైన కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని, వీడియో రికార్డ్ చేయాలని కోరారు. దీనికి హైకోర్టు అనుమతించింది.
మిథున్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను పలుమార్లు ఖండించారు. ఈ స్కాంలో తన ప్రమేయం లేదని, రాష్ట్ర ఖజానాకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పుకొచ్చారు. 2019-2024 మధ్య మద్యం విక్రయాల ద్వారా రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చిందని వివరించారు. మాజీ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్ (Sathya Prasad) స్టేట్మెంట్ ఆధారంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు కూడా ఈ ఆరోపణలను రాజకీయ కక్షసాధింపు చర్యలుగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులతో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.
ఈ స్కాంలో మిథున్ రెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి (Vasudeva Reddy) వంటి వ్యక్తుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. సిట్ ఇటీవల హైదరాబాద్లో కసిరెడ్డి ఆస్తులపై దాడులు చేసి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. అయితే, కసిరెడ్డి దాడులకు ముందే తప్పించుకున్నారు. ఆయన ఆచూకీ కోసం సిట్ గాలిస్తోంది. మరోవైపు ఇదే అంశంపై విచారణకు రావాల్సిందిగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. విజయసాయి రెడ్డి ఇచ్చే స్టేట్ మెంట్ కీలకం అవుతుందని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి మిథున్ రెడ్డి తొలిసారి ఈ కేసులో సిట్ ముందు హాజరవుతుండడం ఆసక్తి రేపుతోంది.













