Raj Kasireddy :రాజ్ కసిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు
లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ( రాజ్ కసిరెడ్డి)కి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad) సహా పలు ప్రాంతాల్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన సిట్ అధికారులు, రాజ్ కసిరెడ్డి పెట్టుబడులకు సంబంధించిన కీలక వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఆయన పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమ (Film industry )కు చెందిన వారిని సిట్ విచారించే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు.దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం (Liquor scandal ) లో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కసిరెడ్డి) దోచుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు సినిమా (Movie) నిర్మాణం చేపట్టినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, ఆ సినిమాను ఎంత బడ్జెట్లో నిర్మించినట్లు చెప్పారు? దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత? ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది? ఏయే రూపాల్లో చెల్లించారు? ఈ సినిమాకు జరిగిన వ్యాపారమెంత? తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్ సేకరించింది. కొంతమందికి నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించింది.













