విధ్వంసకారుల కోసం సిట్ వేట మొదలు…
ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే ఇంకా మకాం వేసింది. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఉన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి పర్యటనలు పూర్తి చేశారు. అవసరమైతే మళ్ళీ దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మొత్తం 33 కేసులు నమోదయ్యాయి. మొత్తం 124 మందిని అరెస్ట్ చేశారు.
అల్లర్లలో మొత్తం 1370 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 1152 మంది పరారీలో ఉన్నట్టు సిట్ గుర్తించింది. తాడిపత్రిలో 636 మంది, పల్నాడు జిల్లాలో 471 మంది, తిరుపతిలో 41 మంది పరారీలో ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఆయా జిల్లాల్లో పోలీసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇవ్వనుంది. మరోసారి తాడిపత్రికి వెళ్లిన సిట్ బృందం… పోలింగ్ తర్వాత జరిగిన కేసుల్లో జిల్లాల పోలీసులు విచారిస్తున్న తీరుపై ఆరా తీయనుంది. తాడిపత్రిలో 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు సిట్ గుర్తించింది.
అయితే ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ గా ఉండడం.. సిట్ ఎకాఎకిన దర్యాప్తు చేస్తుండడంతో… రాష్ట్రంలోని పోలీసు బాసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.మొన్నటివరకూ స్థానిక నేతలు చెప్పినట్లు ఆడిన పోలీసులు.. ఇప్పుడు వారు చెప్పారని చేశాం.. మాకేంటి సంబంధమంటున్నారు. ఈ దర్యాప్తు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అన్న ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు సిట్ సైతం.. దర్యాప్తులో లోపాలు, అనుసరించాల్సిన విధానాలను సైతం వివరిస్తూ.. రిపోర్టులు అడుగుతుండడంతో.. దర్యాప్తు పూర్తిస్థాయిలో కచ్చితమైన పద్ధతిలోనే జరుగుతుందన్న భావన పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.
మరోవైపు… హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న రాజకీయ నేతలు ఇప్పుడు చాలా మంది మీడియా ముందుకు రావడం లేదు. కొందరైతే అజ్ఞాతంలోనే ఉన్నారు. సాక్షాత్తూ ఈసీ కల్పించుకోవడంతో వీరందరి అరెస్టులు తప్పేలా లేవు. ఈసీ సైతం.. ఏపీలో పోలింగ్ తర్వాతి హింసపై చాలా సీరియస్ గా ఉంది. తాము చెప్పినా, ఎందుకు పోలీసులు హింసను అరికట్టలేదన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సీఈసీ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇక్కడి వ్యవహారశైలి దేశవ్యాప్తంగా నాయకులకు ఓ గుణపాఠం నేర్పేలా సీఈసీ వ్యవహరించనుందని తెలుస్తోంది. ఇకపై నేతలు గీత దాటారో.. ఊచలు తప్పవు మరి..













