అమరావతిలో సింగపూర్ అధ్యయన బృందం పర్యటన
సింగపూర్‌కు చెందిన అధ్యయన బృందం నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించింది. సింగపూర్ ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అమరావతి భాగస్వామ్య కార్యాలయానికి చెందిన 26 మంది సభ్యులు కూడా ఈ బృందంతో జత కట్టారు. అమరావతి ప్రాంత వారసత్వం, సంస్కృతి, జీవన ధానం, ఆర్థిక, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి సింగపూర్ బృందం ఈ ప్రాంత పర్యటనకు విచ్చేసిందని చారిత్రక పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఈ బృందంలోని సభ్యులు ముందుగా ఉండవల్లిలోని బౌద్ధ గుహలు, అనంతరం మందడంలోని క్రీ.శ.1261 సంవత్సరానికి చెందిన రాణి రుద్రమదేవి శాసనాలను సందర్శించారు. నాటి చారిత్రక నేపథ్యాన్ని సింగపూర్ బృందానికి శివనాగిరెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఎరిక్టాన్ మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంత వారసత్వ కట్టడాలు తమను విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. అంతకముందు అమరావతి చారిత్రక నేపథ్యంపై విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈవో శివనాగిరెడ్డి నిర్వహించిన అవగాహన శిబిరంలో పాల్గొన్న సింగపూర్ బృందం సభ్యులతో పాటు అక్కడ నుంచి విచ్చేసిన 22 మంది విద్యార్థులు అమరావతి చరిత్రను శ్రద్ధగా ఆలకించారు.













