నవ్యాంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామం
నవ్యాంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి అన్నారు. మంత్రితో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.ఈశ్వరన్ నేతృత్వంలోని వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు చెందిన ప్రతినిధుల బృందంతో కలిసి నెల్లూరు జిల్లా తడ మండలంలోని మమ్బట్టు వద్ద ఉన్న ఏపీ ఇండస్ట్రీయల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసి) పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మమ్ బట్టు ఇండస్ట్రియల్ పారుల్రో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలు, వనరుల లభ్యత తదితర అంశాలను సింగపూర్ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు వివరించారు. చెన్నైకు సమీపంలో ఉన్న ఈ ఇండస్ట్రియల్ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతమైని చెప్పారు. 930 ఎకరాల్లో విస్తరించిన ఈ ఇండస్ట్రియల్ పార్కు ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేశారు. మమ్ బట్టు ఇండస్ట్రియల్ పార్కు తమకు ఎంతోగానో నచ్చిందని సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ ఈశ్వరన్ అన్నారు. ఇక్కడ నీరు, విద్యుత్ లభ్యత పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు. భవిష్యత్తులో వాణిజ్యపరంగా నవ్యాంధ్రకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇండస్ట్రియల్ పార్కులో మంత్రి అమరనాథ్‌రెడ్డి మొక్కలు నాటారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు కాలుష్య నివారణ చర్యలు కూడా అవసరమని, దీనికి చెట్లు నాటడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, నాయుడుపేట ఆర్డీఓ శీననాయక్, ఏపీఐఐసీ నెల్లూరు జోనల్ మేనేజర్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.













