సింగపూర్‌తో మిత్రబంధం
అభివృద్ధిలో సింగపూర్ దూసుకుపోతోందని, సింగపూర్ అభివృద్ధిని అందుకోవాలని ప్రయత్నిస్తున్నామని, రాజధాని నిర్మాణంలో ఎంతగానో సహకరిస్తున్న సింగపూర్ ప్రభుత్వానికి ఎప్పటికీ మిత్రులుగా ఉంటామని ముఖమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సచివాలయంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఈశ్వరన్‌ని కలిసిన సీఎం చంద్రబాబు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్సీ) రెండో సమావేశంలో పాల్గొన్నారు. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు సింగపూర్ ముఖద్వారంగా ఉందని, అక్కడ అమలు చేసే ఉత్తమ విధానాలను మలిదశలో ఏపీలో అమలుచేయాలని సీఎం కోరారు.
అమరావతి నగర నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక అందించడమే కాకుండా నగర నిర్మాణంలోని పలు అంశాలలో భాగస్వాములు కావడం నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్దిలో మేలి మలుపుగా అభివర్ణించారు. రాజధాని పేరుతో ఒక కాంక్రీట్ జంగిల్ నిర్మించాలన్నదే తమ ప్రయత్నమని ఈశ్వరన్‌తో ముఖ్యమంత్రి అన్నారు. రానున్న కాలంలో అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తామని, త్వరలో 1500 ఎలక్ట్రిక్ వాహనలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 30 నిమిషాలలో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేరుకోవాలన్నదే తమ ప్రయత్నమని వివరించారు. ప్రజా రవాణా వ్యవస్థ నిర్మాణంలో సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు.













