అమరావతిలో సింగపూర్ ప్రతినిధుల పర్యటన
అమరావతి నగర గ్రామాల్లో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం పర్యటించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి ప్రారంభమైన సీడ్‌యాక్సెస్ రహదారిని బృందం పరిశీలించింది. సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ ప్రతినిధులు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులతో కలిసి పర్యటించారు. సుబదేవన్, వాంగ్కైయాంగ్, లిమ్స్వీకెంగ్, జంగ్హాస్జంగ్లు, తొలుత అమరావతిలో జరుగుతున్న ప్రధాన రహదారుల అనుసంధాన నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండేలా సీడ్‌యాక్సెస్ రహదారి నిర్మిస్తున్నట్లు ఏడీసీ అధికారులు ప్రతినిధులకు వివరించారు. ఫేజ్-1లో సప్త రహదారుల నిర్మాణం, అమరావతిలో మిగతా రహదారులపైనా చర్చించారు. అనంతరం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన బృందానికి తాగునీటి ప్రణాళికను దృశ్య రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ మౌలిక సదుపాయాల ప్రణాళిక, రూపకల్పన విభాగాధిపతి కేవీగణేష్బాబు, సీనియర్ ప్లానర్ వైవీ కృష్ణ పాల్గొన్నారు.













