అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ ఔట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో చుక్కానిగా వ్యవహరిస్తుందని భావించిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం నిష్క్రమణ దాదాపుగా ఖరారైంది. మేం రాం. మీకు రాం రాం అని రాష్ట్ర ప్రభుత్వానికి సృష్టం చేసినట్లు తెలిసింది. జగన్ సర్కారు కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపకపోవడంతో స్టార్టప్ కథ ముగిసినట్లేనని తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకున్నాయి. అక్కడ రాజధాని ఉండదు అని మంత్రులు చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో స్టార్టప్ ఏరియా నుంచి తప్పుకోవడమే మేలని సింగపూర్ కన్సార్షియం భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమవుతోంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటిదాకా తాము వెచ్చించిన సుమారు రూ.12 కోట్లను తిరిగి చెల్లించినట్లయితే, తమంతట తామే దాని నుంచి వైదొలగుతామని, ఈ విషయంలో న్యాయపరమైన వివాదాలకు వెళ్లబోమని కూడా కన్సార్షియం సృష్టం చేసినట్లు సమాచారం.
విజయవాడలోని ఏపీసీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీలో కీలక సభ్యులైన మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలతో పాటు సీఆర్డీయే ఉన్నతాధికారులు, ఇతర అధికారులతో కన్సార్షియం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తమ నిష్క్రమణ గురించి వారే ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై మంత్రులు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమచారం.













