ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా చేయూతనిస్తాం
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో వెనుకబడే పరిస్థితులు ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గంలో అవగాహన కల్పించడంతోపాటు అన్ని విధాలుగా చేయూతనిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. విజయవాడలో ఎన్నారై వాసవీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటు వల్ల సామాజికవర్గానికి ఎంతో ఉపయుక్తంగా ఉందంటూ వారి కృషిని అభినందించారు. ఇటువంటి అసోసియేషన్ల వల్ల సామాజికంగా ఆర్యవైశ్యులు ముందడుగు వేసే అవకాశం ఉందన్నారు. అసోసియేషన్ కన్వీనర్ తుమ్మలపెంట శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఎన్నికల సమయం లోనూ వారి విజయాలకు తాము పాటుపడుతున్నామన్నారు. ఆర్యవైశ్యులు వ్యాపారపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని అన్నారు. ఈ సామాజికవర్గంలోని పేద కుటుంబాల్లోని విద్యార్థులకు తమ వెబ్సైట్ ద్వారా విదేశాల్లో ఐటీ
ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఆర్థికసాయం చేయడంతోపాటు సామాజిక వర్గంలోని వారికి పెళ్లిళ్లు చేయడం, ప్రమాదాలకు గురైన కుటుంబాలను ఆదుకోవడం వంటి సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో నడిపించేందుకు ఎన్ఆర్ఐవిఈ అనేక ప్రణాళికలు రూపొందిస్తుందని చైర్మన్ పవన్‌కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంబికా కృష్ణా, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, వివిధ రాజకీయపార్టీల ప్రముఖులు పాల్గొన్నారు.













