Ys Jagan: సాయి రెడ్డి స్థానంలో ఉండవల్లి..? జగన్ ప్లాన్ అదేనా..?
ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు పడుతున్న వైఎస్ జగన్(Ys Jagan).. ఢిల్లీలో పట్టు కోసం నానా కష్టాలు పడుతున్నారు. రాజకీయంగా గడ్డు పరిస్థితి ఉన్న నేపథ్యంలో… ఢిల్లీలో అనుకూల పరిస్థితుల కోసం, జగన్ ఏ మార్గం ఉంటే ఆ మార్గాన్ని వాడేందుకు రెడీ అవుతున్నారు. తనతో సన్నిహితంగా ఉండే నేతలను కాంగ్రెస్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ కు, ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar) ను పార్టీలోకి తీసుకోవడానికి జగన్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్న నేతలు కావాలని ప్రయత్నిస్తున్న జగన్, ముందు కాంగ్రెస్ నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. బీజేపీతో సాధ్యమయ్యేలా కనపడకపోవడంతో.. ఎలాగైనా సరే కాంగ్రెస్ కు దగ్గర కావాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ తరుణంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటుగా.. మరో మాజీ ఎంపీ హర్ష కుమార్ ను కూడా పార్టీలోకి తీసుకోవడానికి జగన్ ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్ళిద్దరూ చంద్రబాబు విషయంలో వ్యతిరేకంగా ఉంటారు. హర్ష కుమార్ కాస్త చంద్రబాబుతో మొన్నామధ్య సన్నిహితంగా మెలిగినట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని.. కొన్ని విషయాల్లో హర్ష కుమార్ ఇబ్బంది పడుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనితో వైఎస్ జగన్ ఆయనకు కూడా గాలమేశారు. వీళ్లిద్దరూ గతంలో ఢిల్లీలో రాష్ట్రం తరఫున కీలకపాత్ర పోషించారు. విజయసాయి రెడ్డి ఖాళీని భర్తీ చేసేందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ తో ప్రయత్నించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అటు తన తండ్రి ఆప్తమిత్రుడు కెవిపి రామచంద్రరావు తో కూడా జగన్ సంప్రదింపులు జరుపుతున్నారు. వైయస్ జగన్ సొంత పార్టీ పెట్టిన తర్వాత కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ నుంచి బయటకు రాలేదు. అయితే ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ నుంచి బయటకు తీసుకురావాలని జగన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అలాగే మరో మాజీ ఎంపీ టీ సుబ్బిరామిరెడ్డి వైపు కూడా జగన్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.













