ఏపీలో మద్యనిషేధం.. ‘షార్ట్ ఫిల్మ్ పోటీలు’
ఆంధ్రప్రదేశ్ మద్యవిమోచన ప్రచార కమిటీ (ఏపీఎం పీపీసీ) ఆధ్వర్యంలో లఘుచిత్రాలు (షార్ట్ ఫిల్మ్) పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. స్థానిక కొరిటెపాడు రామన్నపేటలో ఏపీ ఎంవీపీసీ ప్రభుత్వ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మద్యం దుష్ప్రభావాలు.. ఆంధ్రప్రదేశ్ లో దశలవారీ మద్య నిషేధం’ అనే టాపిక్ పైన ఔత్సాహికులు షార్ట్ ఫిల్మ్ లు రూపొందించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం నియంత్రణకు తీసుకున్న కీలక నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. బెల్టు దుకాణాలు తొలగింపు, పర్మిట్ రూమ్ లు రద్దు, మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించడం, దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించడం, ధరల పెంపుతో మద్యం వినియోగం తగ్గించడం, మద్యం విక్రయ వేళల నియంత్రణ, డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుతో వ్యసనపరులతో దురలవాట్లు మాన్పించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చడం.. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో మహిళల కళ్లలో ఆనందం, మద్యపాన వ్యసనం నుంచి విముక్తి పొందిన వారు ఇంటిల్లి పాది కుటుంబంతో గడుపుతూ కళకళలాడుతూ మద్యరహిత ఆంధ్రప్రదేశ్ అవతరించే వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్న అంశాలను నేపధ్యంగా తీసుకుని షార్ట్ ఫిల్మ్ లు రూపొందించాలని సూచించారు.
కేవలం ఐదు నిముషాల నిడివితో షార్ట్ ఫిల్మ్ తయారు చేయాల్సి ఉందన్నారు. అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ అందుబాటులో ఉన్న వనరులతో మాత్రమే షార్ట్ ఫిల్మ్ తీయాలని ప్రభుత్వ లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని నిబంధనలను ఉల్లంఘిస్తే ఏపీ ఎంవీపీసీకి ఎటువంటి బాధ్యత ఉండదన్నారు. తెలుగు భాషలో మాత్రమే ఫిల్మ్ తయారు చేయాలన్నారు. పోటీలకు అందిన వాటిలో నుంచి టాప్ 15 షార్ట్ ఫిల్మ్ లను ఎంపిక చేసి.. వాటిల్లో నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతల కింద బెస్ట్ 5 ఫిల్మ్ ల చొప్పున ఎంపిక జేయడం జరుగుతుందన్నారు. ప్రథమ బహుమతి వరుసలో ఉన్న బెస్ట్ 5 ఫిల్మ్‌లు ఒక్కోదానికి రూ.10వేల నగదు, ద్వితీయ బహుమతి వరుసలో ఉన్న బెస్టు 5 ఫిల్మ్ లు ఒక్కోదానికి రూ. 7,500 నగదు, తృతీయ బహుమతి వరుసలో ఉన్న బెస్టు 5 ఫిల్మ్ లకు ఒక్కోదానికి రూ. 5 వేల చొప్పున నగదు అందజేస్తామని వివరించారు. వీరితో పాటు ఉత్తమ దర్శకత్వంకు రూ.5వేలు, ఉత్తమ రచనకు రూ.5వేలు, ఉత్తమ నటుడుకి రూ.5వేల నగదు ఉంటుందన్నారు.
విజేతలకు నగదు పారితోషకంతో పాటు ప్రభుత్వం తరఫున ప్రశంశా పత్రం, జ్ఞాపిక ప్రదానంతో పాటు సన్మానం కూడా ఉంటుందని లక్ష్మణరెడ్డి వివరించారు. షార్ట్ ఫిల్మ్ లు పంపడానికి ఆఖరుతేదీ సెప్టెంబర్ 25 కాగా విజేతలను సెప్టెంబర్ 28న ప్రకటిస్తామన్నారు. అక్టోబర్ 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి రోజున విజేతలకు బహుమతుల ప్రదానం, సత్కార కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. ఎంట్రీ ఫీజు ఉచితమని.. పోటీలకు పంపే షార్ట్ ఫిల్మ్ జనవరి 2020 నుంచి 25 సెప్టెంబర్ 2020లోగా షూటింగ్ చేయాల్సి ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాలు చెందిన వారితో పాటు తెలంగాణ వారు కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఇంతకుముందు ఎలాంటి పోటీలకు పంపకుండా.. యూట్యూబ్ లో అప్ లోడ్ చేయని తాజా ఫిల్మ్ లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. షార్ట్ ఫిల్మలను apmvpc.gov.in@gmail.com మెయిల్ కి పంపాలన్నారు. మరింత సమాచారం కోసం ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ పీఆర్వో పొగర్తి నాగేశ్వరరావును 9381243599 నెంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.













