YS Vijayamma: తల్లిపై ప్రేమ తగ్గలేదుగా..? జగన్‌కు విజయలక్ష్మి సూటి ప్రశ్న..!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీకి (YS Family) ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. అయితే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు (Saraswathi Power and Industries Ltd) చెందిన వాటాల విషయంలో ఆ కుటుంబంలో తలెత్తిన వివాదం ఆసక్తి రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan), ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి (YS Vijayamma), చెల్లెలు వైఎస్ షర్మిల (YS Sharmila) మధ్య ఈ వాటాల బదలాయింపు విషయంలో తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో విచారణలో ఉంది. తాజాగా సరస్వతి పవర్‌లో 100 శాతం వాటాలు తనవేనని విజయలక్ష్మి NCLTకు తెలిపారు. కంపెనీ యాజమాన్యం కూడా విజయలక్ష్మినే యజమానిగా గుర్తించింది. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో జగన్‌మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి (YS Bharathi Reddy), క్లాసిక్ రియాల్టీ పేరిట ఉన్న వాటాలు 2021 జూన్ 2న విజయలక్ష్మికి బదలాయించారు. ఈ బదలాయింపు గిఫ్ట్ డీడ్, వాటాల కొనుగోలు ఒప్పందం ద్వారా జరిగినట్లు విజయలక్ష్మి తెలిపారు. జగన్‌కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, భారతి డైరెక్టర్‌గా ఉన్న క్లాసిక్ రియాల్టీకి చెందిన వాటాలు కలిపి రూ.1.21 కోట్ల విలువైన షేర్లు బదిలీ అయ్యాయి. అయితే, ఈ బదలాయింపు అక్రమంగా జరిగిందని, తనకు తెలియకుండానే షేర్లు బదిలీ అయ్యాయని ఆరోపిస్తూ జగన్ 2024 సెప్టెంబర్‌లో NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో విజయలక్ష్మి, షర్మిలతో పాటు సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
సరస్వతి పవర్‌లో తనకు 51.01 శాతం వాటా ఉందని, 2019 ఆగస్టు 31న షర్మిలకు భవిష్యత్తులో వాటాలు బదలాయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే తన సంతకాలు లేకుండా, బదలాయింపు ఫారమ్‌లు, డాక్యుమెంట్లు లేకుండానే షేర్లు విజయలక్ష్మి పేరిట బదిలీ అయ్యాయని ఆరోపించారు. ఈ ప్రక్రియ కంపెనీ చట్టానికి విరుద్ధమని, బదలాయించిన షేర్లను రద్దు చేసి తన పేరిట 51.01 శాతం వాటాలను పునరుద్ధరించాలని కోరారు. విజయలక్ష్మి కేవలం ట్రస్టీ మాత్రమేనని, షేర్లను నేరుగా బదిలీ చేసే అధికారం ఆమెకు లేదని వాదిస్తున్నారు.
సరస్వతి పవర్‌లో ప్రస్తుతం జగన్, భారతి పేరిట ఎలాంటి వాటాలూ లేవని, అన్నీ తన పేరిట చట్టబద్ధంగా బదలాయించబడ్డాయని విజయలక్ష్మి తన కౌంటర్‌లో స్పష్టం చేశారు. గిఫ్ట్ డీడ్ ద్వారా వాటాలపై పూర్తి హక్కులు తనకు సంక్రమించాయని చెప్పారు. షర్మిల భవిష్యత్ కోసం చేసిన ఒప్పందాలు అవాస్తవమని పేర్కొన్నారు. జగన్, షర్మిలల మధ్య ఆస్తి వివాదాలను ఈ కేసులోకి లాగడం ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆమె ఆరోపించారు. తనకు సరస్వతి పవర్ వాటాలతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కక్షసాధింపుతో జగన్, భారతి తనను కేసులోకి లాగారని షర్మిల తెలిపారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఈ పిటిషన్ దాఖలు చేశారని, తనను ప్రతివాదిగా చేర్చడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆమె వాదించారు.
NCLT హైదరాబాద్ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. ఫిబ్రవరి 28న జరిగిన విచారణలో జగన్, భారతి దాఖలు చేసిన యథాతథ స్థితి ఉత్తర్వుల అభ్యర్థనను ట్రైబ్యునల్ తిరస్కరించింది. విజయలక్ష్మి, షర్మిల, క్లాసిక్ రియాల్టీలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 6న జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు వాద ప్రతివాదులు సమయం కోరడంతో విచారణ ఏప్రిల్ 3కి వాయిదా పడింది. తాజాగా NCLTలో ఈ అంశంపై విచారణ జరిగింది. జగన్, విజయలక్ష్మి న్యాయవాదుల మధ్య ఈ అంశంపై వాడివేడిగా వాదనలు జరిగినట్లు సమాచారం. చెల్లిపై ప్రేమ తగ్గింది కానీ తల్లిపై కాదు కదా.. అని విజయలక్ష్మి వాదించినట్లు సమాచారం. మరోవైపు.. సరస్వతి పవర్ యాజమాన్యం విజయలక్ష్మినే యజమానిగా గుర్తించినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ ఏప్రిల్ 30కి వాయిదా పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.