Turakapalem: తురకపాలెం వరుస మరణాలు.. కూటమి ప్రభుత్వానికి కఠిన సవాల్..

గుంటూరు జిల్లా (Guntur District)లోని తురకపాలెం (Turakapalem) గ్రామం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గడచిన ఒక నెలలోనే ఇక్కడ 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో భయాందోళనలను పెంచింది. సాధారణ జ్వరంలా ప్రారంభమై చాలా తక్కువ సమయంలోనే మరణాలకు దారితీస్తున్న ఈ వ్యాధి కారణంగా గ్రామస్థులు భయాందోళన ఎదుర్కుంటున్నారు . మీడియా, స్థానిక ప్రజలు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నా సమస్య పరిష్కార దిశగా పెద్దగా ఫలితం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చివరికి వైద్య నిపుణులు దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించారు. మెలిడియోసిస్ (Melioidosis) అనే అరుదైన బ్యాక్టీరియానే ఈ జ్వరాలకు మూలమని స్పష్టం చేశారు. ఈ బ్యాక్టీరియా మనిషి శరీరంలో పరిపక్వం సాధించిన తరువాతే గుర్తించగలమని, అందుకే ప్రారంభ దశలో గుర్తించలేకపోయామని వైద్యులు తెలిపారు. ఇప్పటికే అనేక మంది బాధితులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఇంకా మరిన్ని ప్రాణాలు ప్రమాదంలో పడకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నా, పెద్దగా ఫలితం లేకపోవడం స్థానికులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కూడా స్పందించారు. సమస్యను అణచివేయడంలో రాష్ట్ర వైద్య శాఖకు కష్టాలు ఎదురవుతున్నందున కేంద్రం సహాయం అవసరమని భావించారు. ఆయన సూచనల మేరకు అవసరమైతే అఖిల భారత వైద్య మండలి (Medical Council of India) నిపుణులను కూడా రప్పించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే హైదరాబాదులో (Hyderabad) ఉన్న నిపుణులను సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సీఎం ఆదేశించారు.
ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఆసుపత్రి ఖర్చులను కూడా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరించనున్నారు.
తురకపాలెంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి సామాన్య ప్రజలను మాత్రమే కాకుండా వైద్యరంగాన్నీ కలవరపరుస్తోంది. ఇంత అరుదైన వ్యాధి ఒక ప్రాంతంలో ఇలా విస్తరించడం అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. అయితే ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రాధాన్యం అని సీఎం స్పష్టంచేయడం కొంత ధైర్యాన్నిచ్చే అంశమని చెప్పొచ్చు.