ఎమ్మెల్యేలకు ఇక జగన్ అపాయింట్మెంట్ సులభం…
అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో అధికార పార్టీ నేతల్ని కలవరపెట్టిన ఏకైక సమస్య ఇక దూరం కానుంది. ఇకపై వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నారు. ఈ మేరకు సిఎం నిర్ణయించినట్టు సమచారం. ఇది ఓ రకంగా సంచలనవార్తే అని చెప్పాలి. ఎందుకంటే… తగినంత గౌరవం ఇవ్వరు…ఎవరు చెప్పినా చెవికెక్కించుకోరు.. అంటూ ఎన్నికల ముందు నుంచీ జగన్ పై ఉన్న ఒక అపవాదుకు అధికారంలోకి వచ్చాక మరింత బలం చేకూరేలా ఆయన ఏడాది పాలనలోనూ అదే వ్యవహార శైలి కొనసాగించారని వైసీపీలోనే పలువురిలో ఓ భావన ఉంది. అందుకు తగ్గట్టుగానే గత కొన్ని రోజుల నుంచి స్వంత పార్టీ ఎమ్మెల్యేలే వేర్వేరు అంశాలపై నిరసనగళాలు వినిపించడం, తనకు వైఎస్ జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై ఒక ఎంపి పూర్తి స్థాయిలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం… వంటి జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో ఆదివారం నుంచి మార్పు మొదలయింది…ఇకపై తాను పార్టీ నేతలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నారు వైఎస్ జగన్. ఇక నుంచి ప్రతి రోజూ 10 మంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆయన నిర్ణియించుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అనుసరించాలని జగన్ అనుకుంటున్నారట. ఎమ్మెల్యేలతో భేటీలో నియోజకవర్గ నిధులు,ఇతర సమస్యలు విన్నవించుకోవడానికి అవకాశం ఉండడంతో ఈ పరిణామం పట్ల వైసీపీ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం కోసం సుదీర్ఘ కాలం వేచిచూసిన ఎమ్మెల్యేలకు నిజంగా శుభవార్తేనని చెప్పాలి. మరోవైపు ఈ నిర్ణయం పట్ల వైసీపీ అసమ్మతి ఎంపిగా పార్టీలో పేరు తెచ్చుకున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇకనైనా తనకు సిఎం అపాయింట్మెంట్ దొరుకుతుందని నమ్ముతున్నట్టు చెప్పారాయన.













