బీజేపీ గెలిస్తే పవన్ కల్యాణే సీఎం..! సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్..!!
తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను బరిలోకి దించుతోంది. సీటు ఖరారు చేయడానికే చాలా సమయం తీసుకుంది బీజేపీ. సీటు తమకే కావాలని బీజేపీ.. లేదు.. తమకే ఇవ్వాలని జనసేన పట్టుబట్టడంతో రెండు పార్టీల మధ్య సందిగ్ధత నెలకొంది. రెండు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించుకునేందుకు ఇరుపార్టీల మధ్య ఎన్నో సమావేశాలు జరిగాయి. చివరకు జనసేన కాస్త వెనక్కు తగ్గి బీజేపీకే సీటును అప్పగించింది.
జనసేన క్లియరెన్స్ ఇవ్వడంతో బీజేపీ బరిలోకి దిగుతోంది. అయితే జనసేన శ్రేణులు ఎంతమేర సపోర్ట్ చేస్తాయనే సందేహం బీజేపీకి ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించడమే ఇందుకు కారణం. తిరుపతిలో బీజేపీ కంటే తమకే ఎక్కువ బలం ఉందని జనసేన నేతలు బహిరంగంగానే చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో తిరుపతి సీటును బీజేపీకి వదులుకోవద్దని.. జనసేనే పోటీ చేయాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు సూచించారు. ఒకానొక దశలో బీజేపీతో పొత్తు వద్దని తేల్చి చెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకపోవచ్చనే ప్రచారం కూడా నిన్నమొన్నటివరకూ జరిగింది. అయితే రత్నప్రభ హైదరాబాద్ వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిసిన తర్వాత ఆయన ప్రచారానికి వస్తారని క్లారిటీ వచ్చింది. అయినా ఎక్కడో సందేహం బీజేపీని వెంటాడుతూనే ఉంది. క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులు కలిసిరావేమోననే ఆందోళన బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే నామినేషన్ కంటే ముందే తిరుపతిలో బీజేపీ – జనసేన సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. కలిసి పనిచేద్దామని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కొన్ని కామెంట్స్ ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఈ రాష్ట్రానికి పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన బీజేపీకి ఉందన్నారు సోము వీర్రాజు. పవన్ కల్యాణ్ అంటే ప్రధాని మోదికి ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని తనకు చెప్పినట్లు వివరించారు సోము వీర్రాజు. అమిత్ షాకు కూడా పవన్ అంటే ఎంతో అభిమానం ఉందన్నారు. అయితే జనసేన శ్రేణులను ఉత్సాహపరిచేందుకే సోము వీర్రాజు ఇలాంటి కామెంట్స్ చేశారేమోననే అనుమానం జనసేన శ్రేణుల్లో వినిపిస్తోంది.













