అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. ఆమెపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో అఖిలప్రియ సహా ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముందని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు సికింద్రాబాద్ న్యాయస్థానం స్పందిస్తూ అదనపు సెక్షన్లు దాఖలు చేసినందున తాము బెయిల్ ఇవ్వలేమని పై కోర్టుకు వెళ్లాలని అఖిలప్రియ తరపు న్యాయవాదికి సూచించింది. దీంతో వారు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.













