పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. జిల్లాలో 144 సెక్షన్ అమలు..
ఏపీలో సోమవారం నాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో హై టెన్షన్ మధ్య ముగిసింది. ఓటింగ్ పూర్తయినప్పటికీ ఇంకా పల్నాడు జిల్లాలో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగక తప్పలేదు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు విడుదల అయ్యేంతవరకు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఈ నేపథ్యంలో స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శివ శంకర్ పోలీస్ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు వ్యక్తులకు మించి ఎక్కడా గుమికూడడానికి వీల్లేదని ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నారు. సభలు, సమావేశాలు వంటివి అసలు నిర్వహించకూడదని హెచ్చరించారు. ఈ సెక్షన్ నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు అమల్లో ఉంటుంది.













