పవన్ కళ్యాణ్ నాగబంధం వెనుక అసలు సీక్రెట్..
ప్రపంచంలో మూఢనమ్మకాలకు కొదవలేదు. దోషాలని,జాతకాలని వెర్రిగా నమ్మడమే కాకుండా వాటి నివారణ కోసం పూజలు హోమాలతో పాటు చేతికి రకరకాల ఉంగరాలు తాయెత్తులు కట్టుకుంటుంటారు. ప్రధానంగా రకరకాల రంగు రాళ్లతో చేసినటువంటి ఉంగరాలను దోష నివారణకు ధరించడం మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో జనసేనని పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరాలు పెద్ద చర్చనీ అంశంగా మారాయి. వీటిలో అంతా విడ్డూరం ఏముంది అనుకుంటున్నారా.. మనం ఇప్పటివరకు చేతికి వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, నరసింహ స్వామి ఇలాంటి ఉంగరాలు చూసాం. అయితే పవన్ కళ్యాణ్ చేతికి ఏకంగా నాగబంధం ఉంగరం రూపంలో కనిపిస్తుంది.
గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ తన కుడి చేతి మధ్య వేలుకు నాగబంధం ఉంగరం అలాగే ఉంగరం వేలికి కూర్మావతారం ఉంగరం ధరిస్తున్నారు. దీంతో ఈ ఉంగరాల వెనక అసలు రహస్యం ఏమిటి అనే చర్చ ఇటు సినీ వర్గంతో పాటు అటు రాజకీయ వర్గాలలో కూడా బలంగా నడుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయనను పవన్ కలవడానికి వచ్చారు. అనంతరం బాలకృష్ణ, లోకేష్ తో కలిసి మీడియాతో పవన్ ముచ్చటించినప్పుడు అతని చేతికి ఉన్న ఉంగరాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
మరీ ముఖ్యంగా ఈ రెండు ఉంగరాలలో నాగబంధం ఉంగరం అనేది ఎందుకు ధరిస్తారు అనే చర్చ ఆన్లైన్లో జోరుగా సాగుతోంది. ఈ నాగబంధం ఉంగరం ధరించడం వల్ల దోషాలు తొలగుతాయట. అలాగే అనుకోని విపత్తుల నుంచి రక్షించడానికి కూడా ఇది ధరిస్తారని చెబుతున్నారు. మరికొంతమంది ఈ ఉంగరం ధరించడం వల్ల దుష్టశక్తుల మీద పడకుండా ఉంటుందని.. అలాగే రాహు కేతు దోషాలు నరదిష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. అలాగే కుర్మావతారం ఉంగరం ధరించడం వల్ల అధికార యోగం సిద్ధిస్తుంది అనే విశ్వాసం ఉంది. ఈసారి ఎలాగైనా టిడిపి తో కలిసి అధికారంలోకి రావాలి అనే పట్టుదలతో పాపం పవన్ కళ్యాణ్ ఈ ఉంగరాలు ధరించాడు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనే ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేశామన్న ఆలోచన ఎక్కడ కనిపించడం లేదు అనడానికి ఇది మరొక ఉదాహరణ. ఒకరేమో మఠాలకు, పీఠాలకు వెళ్లి పూర్ణాహుతులు సమర్పిస్తారు.. మరొకరు రాజ్యశ్యామల యాగాన్ని చేయిస్తారు.. ఇంకొకరు చేతికి ఉంగరాలు, నాగబంధాలు పెట్టుకు తిరుగుతారు. ఇవన్నీ పదవిలోకి రావాలి అన్న కాంక్ష కోసమే తప్ప ప్రజల కోసం కాదు. మొత్తానికి ఈసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో యజ్ఞాలు, యాగాలు, మంత్రాలు తంత్రాలు ఎక్కువైపోయాయి. వీటన్నిటి మధ్య ప్రజల పురోగతి మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.













