ఎన్నికలను నిర్వహించలేను : నిమ్మగడ్డ రమేశ్
ప్రస్తుత పరిస్థితుల్లో తాను జెడ్పీటీసీ, ఎంటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయలేనని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు. తన పదవీ కాలం పూర్తవుతుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని స్పష్టం చేశారు. ఈ నెల 31 తో తన పదవీ కాలం ముగుస్తుందని, ఈ బాధ్యతలను వేరే అధికారి నిర్వహిస్తారని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీస్ యంత్రాంగం, అటు ప్రభుత్వ యంత్రాంగం ఎంతో పనిచేశారని కితాబునిచ్చారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయిన వారు నిరభ్యంతరంగా రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని, ఈ ఫిర్యాదుల ఆధారంగా అధికారులు విచారణ చేస్తారని ఆయన తెలిపారు. మరోవైపు పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ చేపట్టాలని నిమ్మగడ్డ అధికారులను ఆదేశించారు.













