జగన్ సర్కార్ తో తాడోపేడో.. మరోసారి సిద్ధమైన నిమ్మగడ్డ
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కి మధ్య వార్ కొత్తేమీ కాదు. అయితే ఈ నెలాఖరులో నిమ్మగడ్డ రిటైర్డ్ కాబోతున్నారు. ఆయన హయాంలో ఎన్నికలే వద్దనుకున్న ప్రభుత్వం కోర్టు ఆదేశాలతో ఎన్నికల పోరుకు వెళ్లక తప్పలేదు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడంతో నిమ్మగడ్డను ఇంతటితో వదిలేస్తారని ఆందరూ భావించారు. అయితే ఆయన రిటైర్డ్ అయ్యేంతవరకూ వదిలిపెట్టే ఉద్దేశం లేనట్లుంది ప్రభుత్వానికి. అందుకే ఆయన్ను సెలవుపై వెళ్లనీయకుండా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీతో నోటీసు ఇచ్చింది. దీనిపై నిమ్మగడ్డ కూడా సమాధానం ఇచ్చారు.
అసలు ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రారని స్పష్టంచేశారు. అసెంబ్లీ అన్నా.. ప్రజాప్రతినిధులన్నా తనకు అత్యంత గౌరవం, నమ్మకం ఉన్నాయని.. అయినా మీరు కోరితే తనవైపు నుంచి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నందున తాను ఎక్కడికీ ప్రయాణాలు చేసే పరిస్థితిలో లేనని క్లారిటీ ఇచ్చారు.
అయితే ప్రివిలేజ్ కమిటీకి లేఖ ఇచ్చిన మరుసటి రోజే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టు గడప తొక్కారు. తాను గవర్నర్ కు వ్యక్తిగతంగా రాసిన లేఖలు లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురి చేస్తోందంటూ నిమ్మగడ్డ గవర్నర్ కు లేఖ రాశారు. అందులో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సల పేర్లు కూడా ఉన్నాయి. అవి లీక్ కావడంతో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసారు. ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ తనను ఇబ్బందులకు గురి చేస్తోందని తాజాగ హైకోర్టు పిటిషన్ లో పేర్కొన్నారు.
తాను గవర్నర్ కు వ్యక్తిగతంలా రాసిన లేఖలు లీక్ కావడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో కక్షిదారులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ, గవర్నర్ ప్రిన్సిపల్ సక్రటరీ, సీబీఐ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలతో పాటు ఈ లేఖలపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన గుంటూరు జిలలాకు చెందిన మిట్టూ రామిరెడ్డి పేర్లను కూడా చేర్చారు నిమ్మగడ్డ.
ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం.. ఈ నెలాఖరుతో నిమ్మగడ్డ వెళ్లిపోతుండడంతో ఈ వార్ ఇంతటితో ముగుస్తుందని అందరూ భావించారు. అయితే ప్రివిలేజ్ కమిటీ ద్వారా తనను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని నిమ్మగడ్డ భావించడంతో ఈ ఇష్యూని ఇంతటితో వదిలేయకూడదని భావించినట్లున్నారు. అందుకే మళ్లీ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మరి ఈ వార్ ఎందాకా వెళ్తుందో వేచి చూడాలి.













