నీలం సాహ్నీ డేరింగ్ డెసిషన్.. పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
అనుకున్నట్టే జరిగింది. నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగబోతున్నారని నిన్నటి నుంచే ఊహాగానాలు వినిపించాయి. ఆమె బాధ్యతలు చేపట్టిన రోజే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటిస్తారని భావించారు. అనుకున్నట్టే ఆమె షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ నెల 8న పోలింగ్ జరుగుతుంది. అవసరమైన చోట 9న రీపోలింగ్ నిర్వహిస్తారు. 10వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. చాలా చోట్ల ఏకగ్రీవాలు కూడా జరిగాయి. వాళ్లు ధృవీకరణ పత్రాలు కూడా అందుకున్నారు. అయితే అవన్నీ బలవంతపు ఏకగ్రీవాలేనని.. అధికార పార్టీ బెదిరించి ఏకగ్రీవాలు చేయించుకుంటోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే కరోనా విజృంభించింది. దీంతో గతేడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది.
అయితే ఈ ఏడాది కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వాటిని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయం సాధించింది. దీంతో మధ్యలో ఆగిపోయిన పరిషత్ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిమ్మగడ్డకు సూచించింది. అయితే మార్చి నెలాఖరుతో ఆయన పదవీకాలం పూర్తవుతుండడంతో వాటిని నిర్వహించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ అధికార పార్టీ మాత్రం 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని.. అది కూడా పూర్తి చేసి వెళ్లాలని కోరింది. ఇంతలోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేశారు.
నిమ్మగడ్డ స్థానంలో గురువారం బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని వచ్చీరాగానే రంగంలోకి దిగిపోయారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎన్నికల ప్రక్రియపై అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అంతేకాక.. శుక్రవారం రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఈ ఎన్నికల వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి తీర్పు వచ్చిన తర్వాత ముందుకెళ్తారని ముందుగా భావించారు. అయితే రాజకీయ పార్టీలతో సమావేశం కాకముందే నోటిఫికేషన్ విడుదల చేశారు నీలం సాహ్ని. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎక్కడ నిలిచిపోయాయో.. అక్కడి నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టారు. ఆమె బాధ్యతలు చేపట్టక ముందే 8వ తేదీన పోలింగ్, 10వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పడు అదే నిజమైంది.













