ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు సంక్రాంతి కానుక
నిరుద్యోగులకు శుభవార్త: కొలువుల క్రాంతి
నెలాఖరులోగా 14 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తాం
ఆయా శాఖల నుంచి వివరాలు రాకనే జాప్యం
ఇప్పటివరకు 21 ప్రకటనలు ఇచ్చాం
ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు నిర్వహిస్తాం
వయోపరిమితి పెంపు ప్రభుత్వ పరిధిలోది
వెల్లడించిన ఏపీపీఎస్సీ
ఈ నెలాఖరులోగా మరో 14 ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ వెల్లడించారు. గత సెప్టెంబరులో ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వులు అనుసరించి డిసెంబరు చివరి వరకు 3,255 ఉద్యోగాల భర్తీకి 21 ప్రకటనలు జారీచేసినట్లు తెలిపారు. రెవెన్యూశాఖ నుంచి వివరాలు రానందున 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అటవీ శాఖకు చెందిన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 330, ఇతర శాఖల ఉద్యోగాల భర్తీ ప్రకటనలు కలిపి 14 వరకు ఇవ్వలేకపోయినట్లు చెప్పారు. ఆయా శాఖల నుంచి వివరాలు అందిన వెంటనే వీటిని కూడా జారీ చేస్తామని తెలిపారు. ఇందుకు ఈ నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
త్వరితగతిన ప్రకటనలు ఇచ్చేందుకు సంప్రదింపులు
విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో సహచర సభ్యులు జింకా రంగజనార్ధన, కె.విజయకుమార్, జి.సుజాత, కె.పద్మరాజు, సేవారూప, కార్యదర్శి మౌర్యలతో కలిసి ఉదయ్‌భాస్కర్ శుక్రవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. త్వరితగతిన ఈ ప్రకటనలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయా శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ప్రకటనల్లో పేర్కొన్న తేదీల్లోనే రాత పరీక్షలు నిర్వహిస్తామని, అనివార్య పరిస్థితులు తలెత్తితే తప్ప వాయిదాలు ఉండవని వెల్లడించారు. ప్రకటించాల్సిన రాత పరీక్ష నిర్వహణ తేదీలను తగిన సమయంలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష రాసేందుకు తక్కువ వ్యవధి ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించగా సెప్టెంబరు నుంచి ఉద్యోగ ప్రకటనల జారీ గురించి అభ్యర్థులకు తెలుసునని వ్యాఖ్యానించారు.













