కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు : బొత్స
కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగుల వేతనాలను చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఒక్కసారి జీవో ఇచ్చిన తర్వాత దాని ప్రకారమే వేతనాలు వస్తాయన్నారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, డీఏలు అన్నీ కొత్త జీవోల ప్రకారమే చెల్లిస్తామన్నారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించామని, వారి కోసం ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ 3 రోజుల పాటు ఎదురు చూసిందని అన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని అందుకే వేతనాలు వేస్తున్నామని అన్నారు.
ఉద్యోగ సంఘాల అభిప్రాయమేంటో తెలియకుండా మంత్రుల కమిటీ ఎలా సిఫార్సులు చేస్తుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక్కడి నాయకత్వంపై విశ్వాసం లేకపోతే ఎలా అని అన్నారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే తదుపరి పర్యవసానాలు ఉంటాయని గుర్తుంచుకోవాన్నారు. బాధ్యతగల వ్యక్తులుగా, రాష్ట్ర ప్రజల కస్టోడియన్లుగా మంత్రులు ఎక్కడా బాధ్యతారహిత్యమైన ప్రకటనలు చేయటం లేదన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు తమ డిమాండ్లను వినిపించాలన్నారు.













