Kommineni Arrest: జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని (Amaravati), ఆ ప్రాంత మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును (Kommineni srinivasa Rao) ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయన్ను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని, విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొమ్మినేని డిబేట్ లో జర్నలిస్టు కృష్ణంరాజు (Krishnam raju) అమరావతిని వేశ్యల రాజధానిగా సంభోధించారు. దీనిపై కొమ్మినేని అభ్యంతరం చెప్పకపోగా వెకిలి నవ్వులు నవ్వారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వాళ్లను అరెస్టు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
సాక్షి టీవీ (Sakshi TV) ఛానల్‌లో ప్రసారమైన ‘లైవ్ విత్ కేఎస్ఆర్’ చర్చా కార్యక్రమానికి కొమ్మినేని శ్రీనివాసరావు యాంకర్‌గా వ్యవహరిస్తున్న్రు. ఈ కార్యక్రమంలో ప్యానెలిస్ట్ గా పాల్గొన్న జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు.. అమరావతి (Amaravati) ప్రాంతంలోని మహిళలను ఉద్దేశించి “అమరావతి వేశ్యల రాజధాని” అని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు సమర్థించడం, వాటిని నియంత్రించకపోవడంతో పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా, ప్రాంతీయ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని రాజధాని ప్రాంత గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
అమరావతి, తుళ్లూరు, మంగళగిరి, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో మహిళలు, రైతులు, స్థానికులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. కొమ్మినేని, కృష్ణంరాజుల చిత్రపటాలను చెప్పులతో కొట్టి, సాక్షి ఛానల్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని అయోధ్య నగర్‌లో కృష్ణంరాజు నివాసాన్ని రైతులు ముట్టడించి, క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ఎదుట స్థానిక మహిళలు, నేతలు నిరసనలు తెలిపారు. మరోవైపు.. రాజకీయంగా కూడా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ నాయకులు, మంత్రులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, డీజీపీకి లేఖ రాసి ఇద్దరు జర్నలిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కొమ్మినేని శ్రీనివాసరావు ఈ అంశంపై స్పందించారు. తమ వల్ల సాక్షి యాజమాన్యం, జగన్, భారతి రెడ్డి ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లకు క్షమాపణలు చెప్తున్నానని ప్రకటించారు. తమ వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉండే పశ్చాత్తాపం తెలియజేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు కృష్ణం రాజు కూడా తన కామెంట్స్ పై స్పందించారు. ఓ వైపు అమరావతిలో సెక్స్ వర్కర్లు, ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువని ఆయన కొన్ని ఆధారాలను బయటపెట్టారు. అయినా ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. అంటే తమ వ్యాఖ్యలపట్ల వాళ్లిద్దరూ ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని అర్థమవుతోంది. దీంతో … వాళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి, విజయవాడకు తరలిస్తున్నారు. కృష్ణంరాజును కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ కేసులో సాక్షి ఛానల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. సాక్షి మీడియా అధినేత్రి వైఎస్ భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని, ఛానల్‌ను మూసివేయాలని మహిళలు ఆందోళనలు చేపట్టారు.