Sajjala – Jagan: మళ్లీ సజ్జలకే పట్టం..! జగన్ ఇక మారరా…?
2024 ఎన్నికల్లో (2024 Elections) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత పార్టీ ఓటమికి కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డే (Sajjala Ramakrishna Reddy) ఓటమికి ప్రధాన కారణం అనే ఆరోపణలున్నాయి. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని (YS Jagan) కేడర్‌కు దూరం చేసి, పార్టీ వ్యవహారాలను సజ్జలే నిర్వహించారని, ఆయన వల్లే పార్టీ ఓడిపోయిందని కొందరు నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయినా, జగన్ మాత్రం సజ్జలకు ఇప్పటికీ అధిక ప్రయారిటీ ఇస్తున్నారు. తాజాగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) ఛైర్మన్‌గా నియమించడం కేడర్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.
2019-2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా (Govt Advisor), పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా (State Coordinator) కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జగన్‌తో సన్నిహిత సంబంధం కలిగిన సజ్జల పార్టీ నిర్ణయాల్లో ఆధిపత్యం చెలాయించారని ఆరోపణలు ఉన్నాయి. సజ్జల వల్ల సీనియర్ నేతలు, కేడర్ జగన్‌కు దూరమయ్యారని.. ఆయన ఒక్కరే అన్నీ నిర్ణయించారని కేడర్ భావిస్తోంది. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, ప్రచార వ్యూహాల్లో సజ్జల నిర్ణయాలే ఓటమికి కారణమని విమర్శలున్నాయి. 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ 2024లో కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ దిగజారుడుకు సజ్జల వ్యవహార శైలే కారణమని కొందరు నేతలు బహిరంగంగా విమర్శించారు.
తాజాగా జగన్ PACని 33 మంది సభ్యులతో పునర్వ్యవస్థీకరించారు. దీనికి సజ్జలను ఛైర్మన్‌గా నియమించారు. ఈ నిర్ణయం కేడర్‌లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఓటమికి కారణమైన వ్యక్తిని మళ్లీ కీలక పదవిలో కూర్చోబెట్టడం సరికాదని కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగన్‌పై విధేయత కారణంగా ఈ అసంతృప్తి బహిరంగంగా వెల్లడి కావడం లేదు. సజ్జల ప్రస్తుతం స్టేట్ కోఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు, ఈ బాధ్యతలను సతీష్ రెడ్డికి (Satish Reddy) అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
వైసీపీ కేడర్‌లో సజ్జలపై అసంతృప్తి గత కొంతకాలంగా స్పష్టంగా కనిపిస్తోంది. సజ్జల నిర్ణయాలు పార్టీని బలహీనపరిచాయని.. అన్నీ ఆయనే చక్కబెడుతూ ఉండడం వల్ల సీనియర్ నేతలు నిరాశకు గురయ్యారని కొందరు భావిస్తున్నారు. ఓటమి తర్వాత జగన్ జిల్లాల పర్యటనలు చేసి కేడర్‌ను ఉత్తేజపరుస్తారని భావించారు. సజ్జల ఆధిపత్యం వల్ల ఇప్పటికీ అది జరగట్లేదని కొందరు భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఆయనపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు తాజా నియామకం చెప్తోంది. అయితే భవిష్యత్తులో ఈ నిర్ణయం పార్టీకి చేటు చేస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. జగన్ ఇప్పటికీ సజ్జలపై ఆధారపడటం చూస్తే, ఆయన మారలేదని అర్థమవుతోందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.













