Yamini Sharma: వాటి గురించి మాట్లాడడానికి మీకేం హక్కు : యామినీశర్మ

ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రభుత్వానికి, హిందువులు హుండీలో వేసే ముడుపులతో సేవచేసే ధార్మిక సంస్థలకు తేడా తెలుసుకుని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల(Sharmila) మాట్లాడాలని బీజేపీ అధికార ప్రతినిధి యామినీశర్మ (Yamini Sharma) హితవు పలికారు. టీటీడీ (TTD) ద్వారా దళిత వాడల్లో మరో 5వేల వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పగానే షర్మిల సమాజసేవ, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 5 వేలు కాదు, 50 వేల ఆలయాలు కట్టుకుంటాం. వాటి గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉందని ప్రశ్నించారు. భక్తులు ఇచ్చిన నిదులను టీటీడీ ధూపదీప నైవేద్యాల కోసం, ధార్మిక వ్యాప్తికోసం ఖర్చు పెడుతోంది. హిందూ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ సొమ్ములు తీసుకోవడం లేదు. ప్రభుత్వమే దేవాదాయ శాఖ ద్వారా ఆలయాల నుంచి పన్నులు వసూలు చేస్తోంది. టీటీడీ ఇప్పటికే ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తోంది అని ఆమె గుర్తు చేశారు. అంత ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం సమాజానికి ఇవ్వాలని షర్మిలకు సూచించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదని, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా దళితులను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు.