చంద్రబాబు గెలిస్తేనే ఆడబిడ్డలకు రక్షణ : యామినీ శర్మ
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కొన్ని మేకవన్నె పులులు వేషాలు వేస్తూ, ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితేనే మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని అన్నారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో యామినీ శర్మ పాల్గొన్నారు. వ్యవస్థలను నాశనం చేయడానికే రాజకీయ దుష్టశక్తులన్నీ ఒక్కటయ్యాయని ఆమె దుయ్యబట్టారు. మేకతోలు కప్పుకున్న పులుల మాటలు నమ్మితే, మహిళల జీవితాలు మట్టిపాలవుతాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రక్షణతో పాటు మహిళల రక్షణ కోసం కూడా పోరాటం చేయాల్సి సమయం వచ్చిందని, మహిళలంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మహిళలు, ఆడబిడ్డలంతా సంతోషంగా, భయభ్రాంతులు లేకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో మహిళలంతా చంద్రన్ననే గెలిపించాని ఆమె విజ్ఞప్తి చేశారు.













