సబ్బం హరి కన్నుమూత

పార్లమెంట్ మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత సబ్బంహరి (69) కన్నుమూశారు. ఆయనకు కరోనా సోకడంతో కొంత కాలంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. విశాఖ మేయర్, అనకాపల్లి ఎంపీగా ఆయన సేవలందించారు. సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 1995 లో విశాఖ మేయర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అవినీతి ఆరోపణలు లేకుండా మేయర్‌గా పరిపాలన చేసి చరిత్ర సృష్టించారు. పారిశుద్ధ్యా్ని ప్రైవేటీకరణ చేసిన తొలి నగరంగా విశాఖను చరిత్రపుటల్లోకి ఎక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే కాపులుప్పాడలో 100 ఎకరాల్లో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్డులో విగ్రహాలు, కొండవాలు ప్రాంతాల్లో కుళాయిలు ఏర్పాటు చేసి ప్రజల్లో ఆదరణ సంపాదించుకున్నారు. ఓ రకంగా చెప్పుకోవాలంటే విశాఖను సుందరంగా నిర్మించడంలో ఈయన పాత్ర ఎనలేనిది. 15 వ లోక్‌సభకు ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో అత్యంత చురుకుగా పనిచేశారు.
అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు గడించారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్ కాంగ్రెస్‌తో విభేదించినా, సబ్బం ఆయనకు అండగా నిలిచారు. ఓదార్పు యాత్ర సమయంలోనూ జగన్‌కు అండగా నిలిచారు. తరువాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సబ్బం హరి టీడీపీలో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా టీడీపీలోనే కొనసాగారు.