Ayyanna Patrudu: అయ్యన్న నాయకత్వానికి మళ్లీ అవకాశమా? మంత్రివర్గ విస్తరణపై ఆశలు

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) మళ్లీ మంత్రిగా అవతరించనున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ (TDP) అధికారికంగా మంత్రివర్గ విస్తరణ విషయాన్ని ఖండించినా, మార్పులు చేర్పులపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో అయ్యన్న పాత్ర కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మానేయడంతో ఆయన బాధ్యతలు తగ్గిపోయాయి. అసెంబ్లీ కార్యాచరణ ఏకపక్షంగా నడవడంతో స్పీకర్‌గా ఆయనకు పనిచేయాలన్న ఉత్సాహం తక్కువగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan ) సభకు దూరంగా ఉండడమే ఇందుకు కారణం. ఈ కారణంగా ఆయన తన అసంతృప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేసినట్లు సమాచారం.
ఇక ఇప్పటికే మంత్రివర్గంలో కొత్తవారే ఎక్కువ మంది ఉన్నారని, వారిలో చాలా మంది ప్రతిపక్ష విమర్శలకు సమాధానం చెప్పడంలో వెనుకపడ్డారని ప్రభుత్వం లోపల అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఇటువంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన అయ్యన్నను మంత్రిగా తీసుకుంటే ప్రభుత్వానికి బలంగా నిలుస్తారని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో జగన్ కారు కింద ఒక వృద్ధుడు మరణించిన సంఘటనపై మంత్రుల నిర్లక్ష్య స్పందనపై కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇలాంటి సందర్భాల్లో అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉంటే సరైన స్పందన ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విపక్షంలో ఉన్నప్పుడు అయ్యన్న తన పదునైన వాయిస్‌తో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ పలు అంశాల్లో చర్చలకు దారి తీశారు. సోషల్ మీడియాలో కూడా ఆయన వ్యాఖ్యలు విస్తృతంగా వైరల్ అయ్యేవి. అయితే ఎన్నికల అనంతరం ఆయనను స్పీకర్ పదవిలో నియమించడాన్ని పలువురు ఆశ్చర్యంగా చూడగా, అది తాత్కాలిక చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనలాంటి అనుభవజ్ఞుడిని మంత్రిగా చేసేందుకు చంద్రబాబు తనదైన వ్యూహంలో భాగంగా ఇలా చేశారని విశ్లేషణలు ఉన్నాయి.
ఇప్పుడు మళ్లీ మంత్రి పదవిపై ఆయన్ను ప్రచారం జోరుగా సాగుతోంది. విశాఖపట్నం (Visakhapatnam) ప్రాంతానికి ఆయన ఎంతో సేవలందించిన నేతగా గుర్తింపు పొందారు. కాబట్టి మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆయనకు అవకాశం రావడం ఖాయమని అంటున్నారు. పైగా ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న జగన్ గత కొద్దికాలంగా తిరిగి కూటమి ప్రభుత్వంపై తన అస్త్రాలను సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు లాంటి అనుభవజ్ఞుల అవసరం పార్టీకి చాలా ఉంది. దీంతో ఇక అసలు విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? ఆయనకు అవకాశం వస్తుందా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.