60 మంది విద్యార్థులకు అమెరికాకు చెందిన ఎన్ఎస్ఎఫ్ ఉపకార వేతనాలు
అమెరికాకు చెందిన నార్త్ సౌత్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) విజయవాడ చాప్టర్ 60 మంది విద్యార్థులకు రూ.11.40 లక్షల నగదును ఉపకార వేతనాలుగా అందజేసింది. ఈ సందర్భంగా చాప్టర్ సమన్వయకర్త సూరపనేని వెంకటరత్నం మాట్లాడుతూ 1989లో షికాగోలో చిట్టూరి రత్నం ఆధ్వర్యంలో స్థాపించిన ఈ సంస్థ విశేష ప్రతిభ చూపే విద్యార్థులను గుర్తించి ఏటా ఉపకార వేతనాలను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఎస్ఆర్జీఈసీ, ఏఏఎన్ఎం`వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాల నుంచి 36 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున, పాలిటెక్నిక్ కళాశాల నుంచి 24 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.11.40 లక్షల నగదును పంపిణీ చేసినట్లు వివరించారు. ఎస్ఆర్జీఈపీ, ఏఏఎన్ఎం సంస్థల సహకార్యదర్శి, సహకారస్పాండెంట్ వల్లురుపల్లి రామకృష్ణ విద్యార్థులకు ఈ మొత్తాలను అందించారు. ప్రిన్సిపల్స్ డాక్టర్ గుత్తా ప్రసాద్, జీవీవీ. సత్యనారాయణ, వైఎస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ కోదండరామారావు, డాక్టర్ ఎంఆర్ సీహెచ్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.













