అది వారాహి కాదు.. నారాహి : మంత్రి రోజా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం వాహనం వారాహి కాదు, నారాహి అని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. తిరుపతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక, అభివృద్ధిపై జరిగిన సౌత్ జోన్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందని అన్నారు. 2023లో పర్యాటక రంగంలో ఏపీని మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో తీర ప్రాంతాల అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయని, కొత్త జనరేషన్ పర్యాటక ప్రాంతాలు పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఐటిపిఐ సలహాలు, సూచనలు తీసుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తులతో పవన్ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడని, ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలని పనవ్ చూస్తున్నట్లు ఉందని అన్నారు. వారాహి రంగుపై పవన్ కల్యాణ్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు.













